విశాఖ. వైఎస్సార్సిపి ప్రభుత్వం ప్రజలపైన, రైతులపైన వేసిన విద్యుత్ భారాలు రద్దుచేయకపోతే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సిపిఎం, సిపిఐ పార్టీల విశాఖ జిల్లా కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, ఎం.పైడిరాజులు హెచ్చరించారు. ఈమేరకు బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖలో ఎపిఇపిడిసిఎల్ సిఎండి కార్యాలయం వద్ద భారీ ప్రదర్శన, నిరసన జరిగింది. అనంతరం ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ ఆపరేటర్ అధికారికి వినతిపత్రం అందజేసారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బిజెపి తెచ్చిన విద్యుత్ సంస్కరణలు 2022 చట్టాన్ని రాష్ట్రంలో వేగవంతం అమలు చేసి ప్రజలపైన, రైతులపైన మోయలేని భారాలు మోపుతోందని మండిపడ్డారు. వర్షాకాలం వచ్చినా విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని, ప్రతినెల చార్జీలు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్లు వరకు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చి నమ్మకద్రోహం చేసారని విమర్శించారు. వివిధ రూపాలలో విద్యుత్ యూనిట్ ధరలు పెంపు, స్లాబ్‌లు మార్చడం, ట్రూఅప్, సర్దుబాటు, విద్యుత్ సుంకం, ఫిక్స్డ్, కస్టమర్, సర్ చార్జీలంటూ ఈ నాలుగేళ్ళలో 50వేల కోట్ల రూపాయల భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేసారు. నేడు విద్యుత్ మీటర్లుకు ఆధార్‌లింక్ పెట్టి అదనపు డిపాజిట్లు పూనుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతినెల విద్యుత్ చార్జీలు పెంచే విధానాన్ని ప్రవేశపెట్టారని, రైతుల ఉచిత విద్యుత్తుకు ఎసరు పెడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఇస్తున్న రాయితీలకు కోత పెడుతున్నారన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రానున్న కాలంలో సబ్సిడీ ఎత్తివేయాలని ఆలోచిస్తున్నదని, రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారని, అదాని తదితర కార్పొరేట్లకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారని తెలిపారు. మీటర్లు రైతులు, వినియోగదారుల పాలిట ఉరితాళ్ళుగా మారనున్నాయన్నారు. ముందుగానే విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రీపెయిడ్ విధానం ప్రవేశపెట్టి, స్మార్ట్ మీటర్ల కయ్యే వేలాది రూపాయలు వినియోగదారులే భరించాలని కుట్ర పన్నుతున్నారని, రాత్రిపూట వినియోగించుకునే కరెంటుకు అదనపు బిల్లులు వేసే ప్రమాదకర విధానం తెస్తున్నారన్నారని మండిపడ్డారు. బిజెపి పాలిక రాష్ట్రాలలో కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాన్ని అమలు చేయకపోయినా నేడు మన రాష్ట్రంలో అమలు చేసి బిజెపికి, కార్పొరేట్లకు దాసోహంగా మారిపోయిందన్నారు. విద్యుత్ రంగాన్ని అదానీ, కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు. తక్షణమే 2022 విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, వినియోగదారులపై వేసిన భారాలు రద్దుచేయాలని, స్మార్ట్‌మీటర్లు ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పట్టేలా ప్రజా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసనలో సిపిఐ సిపిఎం పార్టీలు నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.పద్మ, బి ఈశ్వరమ్మ, కె సత్యనారాయణ, వై రాజు, పి చంద్రశేఖర్, వి కృష్ణారావు, సిఎన్ క్షేత్రపాల్, ఆర్.లక్ష్మణమూర్తి, జి రాంబాబు, ఎం సుబ్బారావు, బి.రమణి, జిఎస్‌జె అచ్చుతరావు, బి.వెంకటరావు, యు.ఎన్.ఎన్.రాజు, కె సత్యాంజనేయ, ఎం డి బేగం, వనజాక్షి, కుమారి, దేముడమ్మ తదితరులతో పాటు సిపిఐ సిపిఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!