రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు మంత్రాలయంలో విషాదం నింపారు. ఓ యువతి, యువకుడు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న ఘటన సోమవారం అందరినీ కలచివేసింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంత్రాలయం మండలంలోని రచ్చమర్రి గ్రామానికి చాకలి చిన్న గోవిందు మొదటి భార్య ఏకైక కుమారుడు వెంకటేష్ (వయసు 20), మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన నందిని(వయసు 19) అనే యువతి రచ్చమర్రి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం మంత్రాలయం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ప్రస్తుతం నందిని కర్నూలులో బీటెక్ చదువుతోంది. ఇంటర్ పూర్తిచేసుకున్న వెంకటేష్ వచ్చే ఏడాది బీటెక్ చదవాలని భావించాడు. చుదువుకున్న రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇష్టపడిన వారిద్దరూ ఏం ఆలోచన చేశారేమోగాని ఆదివారం అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయారు. తుంగభద్ర రైల్వే స్టేషన్లకు చేరుకుని సమీపంలోని బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించిన గ్యాంగ్ మ్యాన్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా రైల్వే ఎస్ఐ గోపాల్ సంఘటన స్థలం చేరుకున్నారు. మృతదేహాలను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం వరకు తమతో ఉన్న వారు సోమవారం ఉదయం శవాలుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
This post was created with our nice and easy submission form. Create your post!