*Indian Railways: ప్రయాణికుల గుడ్ న్యూస్.. దసరా వేళ 600 ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే..*
హైదరాబాద్, అక్టోబర్ 16: అసలే పండుగ సీజన్.. పైగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వెరసి ప్రజంతా పట్టణం నుంచి తమ తమ ఊళ్లకు పయనం అవుతున్నారు. అయితే, పండుగ వేళ వాహనాలన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ దసరా పండుగలో ఇంటికి వెళ్లాలని లేదా ట్రిప్‌కు వెళ్లాలని అనుకున్న వారికి సాధారణ రైళ్లలో సీట్లు దొరకడం కష్టం. ఇలాంటి సమయంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. దాదాపు 620 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర పొరుగు రాష్ట్రాలకు నడపునున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్‌లో పండుగల నెల కావడంతో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడపడానికి SCR సిద్ధమైంది. జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి ఈ ప్రత్రేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈ పండుగల సీజన్‌లో, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారు. ఈ సమయంలో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేస్తోంది సౌత్ సెంట్రల్ రైల్వే. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. జైపూర్, షిర్డీ, రామేశ్వరం, రద్దీ గల ఇతర ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.
“ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేయడం జరిగింది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు దాదాపు 100 సర్వీసులు అదనంగా నడుస్తున్నాయి. రోజూ రెగ్యులర్ రూట్‌లను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. ఒక మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు.. సాధారణ రైళ్ల కోచ్‌లను పెంచుతాము.’’ అని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. అంతేకాకుండా, ప్రత్యేకంగా రైలును నడిపేందుకు కోచ్‌లు అందుబాటులో ఉంటే.. రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉంటారు. దసరా పండుగ వేళ విద్యాసంస్థలు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించడం.. పండుగ వేళ చాలా కుటుంబాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఇతర రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో 140 రైళ్లు SCR జోన్ వెలుపల ప్రయాణీకులను తీసుకెళ్లడానికి, పండుగ సీజన్లో ఇతర రాష్ట్రాల నుండి సౌత్ సెంట్రల్ జోన్‌లోకి ప్రయాణికులను తీసుకురావడానికి షెడ్యూల్ చేయడం జరిగింది’ అని రైల్వే అధికారులు తెలిపారు.
దసరా పండుగ సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని SCR ఇప్పటికే ‘భారత్ గౌరవ్ టూరిస్ట్’ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ నెలలో, రెండు ‘భారత్ గౌరవ్’ రైళ్లు కాశీ, పూరి, అయోధ్య, రామేశ్వరం, మొదలైన పవిత్ర స్థలాలకు ప్రయాణిస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం తగిన సిబ్బందితో అదనపు టికెట్ కౌంటర్లు, మార్గదర్శకాలను అందుబాటులో ఉంచుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!