అంతా ఓపెన్‌గానే జరిగింది..దీనిలో స్కామ్ ఎక్కడుంది?: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు..
అవినీతి చేసినట్లు ఆధారాలు చూపించలేదు: ప్రమోద్‌కుమార్ దూబే
చంద్రబాబు తరఫున ప్రమోద్‌కుమార్ దూబే వాదిస్తూ ”స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్ ఎక్కడుంది?చంద్రబాబు పాత్ర ఏముంది?ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్ వేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలి” అని కోర్టును కోరారు.
బ్యాంకు లావాదేవీలపై విచారించాల్సి ఉంది: పొన్నవోలు
సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపిస్తూ ” ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదు. ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుంది. కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది”అని చెప్పారు..
This post was created with our nice and easy submission form. Create your post!