*Chandrayaan-3:
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసేసిందని, స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ సోమనాథ్ (Somanath) వెల్లడించారు. ఖగోళాన్ని మరింతలోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)పై ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, స్పష్టమైన తేదీని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రముఖ సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉందని చెప్పారు. చంద్రుడిపై రాత్రి పూట (భూమిపై 15 రోజులకు సమానం) పగలు కంటే దాదాపు 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లు ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే.. రోవర్ కచ్చితంగా మేల్కొంటుందని చెప్పారు. ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలకం కాకపోయినా ఫర్వాలేదని అన్నారు. చంద్రుడిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నించినట్లు ఇటీవల ఇస్రో వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 2న రోవర్, 4న ల్యాండర్‌ను ఇస్రో నిద్రాణస్థితికి పంపింది. మరోవైపు ఎక్స్‌పోశాట్‌తోపాటు, ఇన్‌శాట్-3డీఎస్‌ను కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్లు సోమనాథ్ వెల్లడించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. అదే నెలల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3ని కూడా ప్రయోగిస్తామన్నారు. నాసా-ఇస్రో సంయుక్తంగా మరో ప్రాజెక్టు చేపడుతోందన్న ఆయన.. దీనిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగిస్తామన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!